Friday, October 24, 2008

ఇంగ్లీష్ జులుం నశించాలి

ప్రతీఒక్కరి జీవితంలో 'చీ వెధవ జీవితం' 'వెధవ బ్రతుకు ' ...అనుకునే సందర్భం ఒక్కసారన్నా ఎదురవుతుందనుకుంటా. నాకు ఈమధ్య ప్రతీ రోజూ ఎదురవుతూ ఉంది అమ్రికాలో, అదీ ఇంగ్లీషు వల్ల..:(


మొన్న ఒక పని మీద లోకల్ కౌన్సిల్ ఆఫీస్కెళ్ళి ...అక్కడ కౌంటర్లో ఉన్న పిట్ట దగ్గరకెళ్ళి నా ఆంగ్లభాషాపాండిత్యాన్నంతా రంగరించి ఎందుకొచ్చానో చెప్పా...మియాం మియాం..బౌ బౌ..కావ్ కావ్ అని చేతిలో పెన్ను గాల్లో తిప్పుతూ 2 నిమిషాల పాటూ ఏదో చెప్పింది. ఒక్కముక్కా అర్దంకాలా...దాసరి అరుణ్ కుమార్ లా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషనూ లేకుండా అక్కడే నిల్చున్నా. అంతే ..'చీ నిన్ను తగలెయ్య...పొద్దున్నే నువ్వు దాపురించేవేరా నా ఖర్మకి ' టైపులో ఒక చూపుచూసి విసురుగాలేసి పక్కరూంలోకెళ్ళి ఒక అప్ప్లికేషను తెచ్చి నా ముందుపడేసింది.

హమ్మయ్యా.. అనుకుని అప్ప్లికేషన్లో ఉన్న 'నీ ముందు పేరు, ఎనక పేరు, ఎప్పుడు పుట్టావ్, ఏ రాశి, ఎందుకొచ్చావ్, ఎప్పుడుపోతావ్' లాంటి ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసేసి ...ఇంటర్ ఇంగ్లీష్ ఎక్జాం పేపర్ అరంగంటలో పూర్తిచేసిన వీరుడిలా పిట్ట దగ్గరకెళ్ళి నుంచున్నా. ఇంతకముందు జరిగిన అనుభవంతో జాగర్తపడిందనుకుంటా మాట్టాడకుండా అప్ప్లికేషన్ తీసుకుని సీట్లోంచి లేసొచ్చి నన్ను దగ్గరుండి నడిపించుకెళ్ళి పక్కనేఉన్న గదిలో ఒక బల్లమీద కూర్చోపెట్టి 'నీకో నమస్కారం రా నాయనా' అన్నట్టు ఒక నవ్వునవ్వి వెళ్ళిపోయింది.

ఆల్రెడీ అక్కడ ఇద్దరాడోళ్ళు,ఒక ముసలాయన కూర్చునున్నారు. ఓహో ఇక్కడ కూర్చుంటే వాళ్ళే వచ్చి పిలుస్తారన్నమాట ...అక్కడే చతికిలపడి ఇద్దారాడోళ్ళవంకా చూస్తూ కుర్చున్నా. ఇంతలో లొపల్నుంచి ఒక తెల్లదొరొచ్చి 'వ్ష్హ్ బుస్ష్హ్' అని ఏదో కూసాడు. వెంటనే ఇద్దరాడోళ్ళూ రెస్పాండయ్యి వాడితో లోపలకి పోయారు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ వాడొచ్చి 'అరే చీ..అరేచీ' అని ఎదో కూసాడు. నేను ముసలాడొంక చూసా...నిన్నే పిలుస్తున్నారన్న టైపులో . ముసలాడు కదల్లేదు. ఎవడూ కదలక పోయేసరికి తెల్లదొర 'ఉఫ్ఫ్' అనుకుంటూ లోపల్కి పోయాడు. 2 నిమిషాల తర్వాత ఆ ఇద్దరాడోల్లు బయటకొచ్చి ముసలాణ్ణి తీసుకుని వెళ్ళిపోయారు.

హమ్మనీ ...కొంపదీసి ఇందాక తెల్లదొర పిలిచింది నన్నేనా?

ధైర్యం చేసి తలుపు కొట్టి ..తెల్లదొర రూంలోకెళ్ళా..

'ఏంటన్నట్టు చూసాడు '

'మరేమోనండీ..నేను రిషి అండీ..అప్ప్లికేషనండీ' అని వాడికి ఇంగ్లీషులో కొన్ని క్లూలు ఇచ్చేసరికి...అప్లికేషన్ తీసి నాకు చూపించి ఇదేనా అన్నాడు.


'ఎస్...ఎక్జాట్లీ' అన్నా..


దాంతో తెల్లదొరకి కాలిపోయి..'ఇందాక బయట అన్నిసార్లు 'అరెచీ అరెచీ' అని కేకలు పెట్టినా నీకు అర్దం కాలేదారా ..

ఏ వూర్రా మీది ..ఎర్రబస్సెక్కోచ్చేవా అమ్రికాకి..' నవ్వుతూ చెప్తున్నట్టు నటిస్తూ ఏకి పారేసాడు.

దెబ్బకి అవమానభారంతో మనిషిని కావడానికి చాలారోజులు పట్టింది. అయినా రిషి అన్న నాపేరుని వంగడదీసి నాలుగుగుద్దులు గుద్ది పీక కోసి 'అరెచీ' అంటే నాకు మాత్రం ఎట్టా తెలుస్తుందండీ వాడు నన్నే పిలిచాడనీ. అసలు ఈ ఇంగ్లీష్తో వచ్చిన చిక్కే ఇది..దేనినైనా మొదట ఎలా పలకాలో తెలీదు..తెలిసినా స్పెల్లింగ్ పూర్తిగా వచ్చి చావదు...ఈ రెండూ తెలిస్తే ఆ పదాన్ని ఎక్కడ ప్రయోగించి చావాలో అర్దమవ్వేలోపు ఈ నేర్చుకున్న పదం కాస్తా మర్చిపోతాను. తలకి చుండ్రు పట్టినట్టు చిన్నప్పుడు నాలుగో తరగతి చదివేటప్పుడు తగులుకుంది నాకు ఈ ఇంగ్లీషు ఫోభియా.

ఓం ప్రధమం అని ABCDలు మొదలెట్టినప్పుడే పేద్ద కంఫ్యూజన్...ఓకటో బరి, రెండో బరి,మూడోబరి,నాల్గో బరి....ఒకే భాషకి ఇన్ని వర్షన్లేంటో అర్ధమయ్యేదికాదు.మరి మన 'అ,ఆ'ల కేంటి ఇన్ని బర్లు లేవు అని అడిగితే చితకబాదేసెరోరోజు మా ఇంగ్లీష్ మేష్టారు. అప్పట్నుంచీ నాకు ఇంగ్లీషంటేనే చిరాకు, అసహ్యం.....నిజం చెప్పాలంటే భయం.
ఏవో తిప్పలు పడి, పిల్లి మొగ్గలేసి...అప్పటికి గండం గట్టెక్కినా..ఐదో కళాసునుంచి ఇంగ్లీషు మరింత ప్రతాపం చూపించడం మొదలెట్టింది. రామ కిల్డ్ రావణ, రావణ కిల్డ్ బై రామ...చచ్చిన పాముని ఎన్నిసార్లు చంపుతార్రా వెధవల్లార్రా అనుకునేవాడిని. ఇహ ఏడో తరగతి పబ్లిక్ పరీక్షలు...అన్ని సబ్జెక్ట్లూ రుబ్బుడే రుబ్బుడు. ఇంగ్లీషు మేష్టారైతే ఒక్కోక్కడి గొంతూ పెగల్దీసి ఇంగ్లీషు పుస్తకాలు కూరేసేవోడు...రోజుకొకడిని టార్గెట్ చేసి మరీ బాదేయడమే. నన్నుకూడా ఓరోజు టార్గెట్ చేసి 'ఎంప్టీ గ్లాస్ ' స్పెల్లింగ్ రాయరా అంటే 'M.T గ్లాస్ ' అని రాసా, గదంతా పరుగులుపెట్టించి మరీ కొట్టేడు. ఇంగ్లీషు పంతుల్ని నక్సలైట్లు చంపెత్తే బావుండు అనిపించేది.

ఇదంతా ఒక ఎత్తైతే మా తాతగారి గోల ఇంకో ఎత్తు. ఆయన నాకు..నేను ఆయనకి అచ్చ తెలుగులో 15 పైసల కార్డుమీద వుత్తరాలు రాసుకునేవాళ్ళం..ప్రాణం సుఖంగా ఉండేది.నాకు ఇంగ్లీష్ మీద ఇంటెరెష్టు పెరుగుతుందనికాబోసు 'ఇంగ్లీషులో' వుత్తరం రాయమని ఒకటే గోల. అది పడలేక మన 'లేఖిని 'లో తెలుగు ఇంగ్లీషులో టైప్ చేసినట్టు నేను అచ్చ తెలుగుని ఇంగ్లీష్లో రాసి కార్డు పోస్టుచేసా. ఆ ఆనందం (?) తట్టుకోలేక ఆ సంవత్సరమే పెన్షనూ గట్రా మా నాన్నమ్మకి ట్రాన్స్ఫర్ చేసి టపీ మన్నారు.

తర్వాతర్వాత తెలుగుమీడియం చదువులు...ఇంగ్లీషుకి మాత్రం ఎదో మాష్టారి కాళ్ళు పట్టుకోడం... అలా డిగ్రీ దాకా నెట్టుకొచ్చేసా.తర్వాత అంతరిక్షంలో గ్రహాల కదలికల్లో ఎదో తేడా జరిగి నాకు MCA లో రాంక్ రావడం హైదరాబాదు వెళ్ళీ JNTU లో జాయినవ్వడం జరిగింది. ఇంగ్లీషు కష్టాలు మళ్ళీ మొదల్లయ్యాయ్.కాలేజీలో సీనియర్లు తెలుగులో కుళ్ళుజోకులేసుకుంటూ మాతో మాత్రం 'టెంగ్లీష్' లోనే మాట్లాడేవారు. నాకు తిక్కరేగిపోయేది..దానికితోడు మా క్లాసులోకూడ కొంతమంది తెలుగు 0.5% ఇంగ్లీషు 80% హైదరబాదీ హిందీ 19.5% మిక్స్ చేసి హింగిలీషు మాట్లేడేవోరు. నేను నాలాంటి 'వాజమ్మ ' బాచ్ ని ఒకటి తయారుచేసి వాళ్ళతోనే గడిపేవాడిని.సీనియర్లు రాసుకురమ్మన్న 'CV' ని తెలుగులో రాసానని ..ఆరోజునుంచీ ప్రతీదీ తెలుగులోనే మాట్లాడాలని సర్క్యులర్ జారీ చేసారు సీనియర్సు, 'హలో సార్ ' కి 'ప్రణామం ఆచార్యా' టైపన్నమాట . ఇంగ్లీష్ కానిదేదైనా మనకి వాకే.

ఇక చివరి సంవత్సరం కాంపస్ ఇంటర్వ్యూ ల టైంకి మన 'హింగ్లీష్' పిచ్చి ( భయం ) బాగా ముదిరిపోయి..రోజూ పిడివేసే 'టెల్ మీ అబవుట్ యువర్ సెల్ఫ్' కూడా గుర్తుండేది కాదు. కాంపస్ సెలెక్షన్లో చచ్చీ చెడీ అన్ని రౌండులూ దాటినా... హెచ్చార్ (H.R)రౌండ్లో జెల్ల పడేది. ఒక హెచ్చార్ రౌండులో 'ఇంటర్లో' అన్ని తక్కువమార్కులెందుకొచ్చాయిరా అన్నప్రశ్నకి జవాబు తెలుగులో తెలిసినా ఇంగ్లీష్లో తర్జుమా చేసే కెపాసిటీ లేక 'టెల్ మీ అబవుట్ యువర్ సెల్ఫ్' నే మళ్ళీ అప్పచెప్పేసరికి ఇంటర్వ్యూవర్ పిచ్చి పిచ్చి గా కేకలు పెడుతూ వరండా అంతా పరుగులుపెట్టాడు.

అసలు కామెడి 'సత్యం' ఇంటెర్వ్యూలో జరిగింది.....నేను రాత పరీక్షా గట్రా దాటి 'గ్రూప్ డిస్కషన్ ' కి సెలక్ట్ అయ్యాను. నేనేంటి గ్రూప్ డిస్కషనేంటి నాకే నవ్వొచ్చింది. వెంటనే తిరిగి రూంకొచ్చేద్దాం అనుకుంటే మా 'వాజమ్మ ' బ్యాచు బలవంతంగా ముందుకు తోసారు. గ్రూప్ డిస్కషన్ లో నలుగురు నలుగురు గా విడదీసి ఎవరికీ అర్ధం కాని ఒక టాపిక్ ఇచ్చి 'ఉస్కో' అన్నారు. నేను తప్ప అందరూ దిస్కషన్ పేరుతో జుట్టూ జుట్టూ పట్టుకునే స్టేజ్ కి వెళ్ళిపోయారు, నేను నా జుత్తు నేనే పీక్కోని బయటకొచ్చేసా.

తర్వాత గ్రహాల కదలికలో మళ్ళీ అదే తేడా జరిగి ..మరియూ ఒకానొక సాఫ్ట్వేర్ కంపనీ తలరాత బాగుండక నాకు జాబుదొరికింది. జాబులో జాయినయ్యాకా ఇంగ్లీషు కష్టాలు కి ఇక లొంగిపోవడమేగానీ తప్పించుకుపోలేం అని అర్ధమయ్యి 'ఎస్, నో, ఆల్రైట్' తరహాలో కాలం గడిపేస్తున్నా....కాలాక్రమంలో 'యో మ్యాన్...యో యో', 'కూల్ బడీ' లాంటి పదప్రయోగాలూ నేర్చుకున్నా.

ఇంతకీ..ఇంగ్లీషు అంటే అంత భయమున్నవాడివి అమ్రికా ఎందుకెళ్ళావురా అంటారా.... అంతా గ్రహాల మహత్యం మా కంపనీ తలరాత బాబూ :)

అయినా అమ్రికా డాలర్లు చేగోడీలంత రుచిగా ఉంటాయ్..తెలీందేముందీ..