Wednesday, December 31, 2008

ఫట్..టపక్..దడక్!

లలలల.లా........రాగాలా పల్లకిలో కోయిలమ్మా..రాలేదు ఈవేళ ఎందుకమ్మా...?
మ్హ్..నా లాప్ టాప్ పోయిందండీ..!

తెలుసు..పీడా విరగడయ్యింది.....అందుకే రాలేదు ఈవేళ కోయిలమ్మా :)

********************
పోయిందంటే...ఎవడూ కొట్టేయలేదండీ...మొన్న డిశంబరు22న సాయంత్రం 6గం.23నిమిషములకు నాచేతిలోంచి జారిపడి నేలకి కొట్టుకుని కోమాలోకి పోయింది:)


అసలీ దుర్ఘటన ఎలా జరిగింది? ఇలా జరగడానికి కారణాలేంటి? జరుగుతున్న పరిణామాలను మా ప్రతినిది రిషి ఇప్పుడు మీకు అందిస్తారు. అరెరె అలా కంగారు పడకండి..ఉత్తిత్తినే..సరదాకి.


******అసలేమిజరిగిందంటే*************

గత నెలరోజులుగా మా ప్రొజెక్ట్ లో గుండెకాయలాంటి మాడ్యూల్ ఒకదానికి పోయేకాలమొచ్చి తిక్క తిక్కగా ప్రవర్తించడం మొదలెట్టింది...దాంతో మా మేనేజర్కి పైనుంచి మొట్టికాయలుపడి బుర్రంతా సొట్టలుపడిపోయింది.అసలే అరగుండు దానిమీద సొట్టలు దాంతో మావాడికి తిక్కరేగి ప్రోజెక్ట్ లో 'ఎమర్జెన్సీ' ప్రకటించేసాడు.

మానవహక్కులు దారుణంగా హరించబడ్డాయి. కాంటీన్లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నవాళ్ళనీ, బాత్రూముల్లో వున్నోళ్ళనీ, బాల్కనీలో తిర్గుతున్నోళ్ళనీ ఎలా ఉంటే అలా తీసుకొచ్చి ఎవడి సీట్లో వాడిని కట్టి పడేసారు. మా మేనేజర్ వచ్చి జరిగినవిషయం చెప్పి సింబాలిక్ గా తన సొట్టలు పడిన బుర్ర చూపించి డిశంబర్ 22 కల్లా ప్రోజెక్ట్ కి రిపేర్లు గట్రా చేసి మామూలు స్టేజ్ కి తీసుకురాపోతే "తాట తీస్తా" అని ఇంద్ర సినిమాలో చిరంజీవి లెవెల్లో వార్నింగ్ ఇచ్చిపోయాడు.


ఆ...ఇలాంటివి ఇండియాలో బొచ్చెడు చూసాం..అనుకుని మరసటి రోజు పొద్దున్నే వచ్చి ఇంటర్నెట్ వోపెన్ చేసి "కూడలి" అని కొట్టా.."తాట తీస్తా" అని పెద్ద పెద్ద అక్షారలతో ఒక పేజ్ ప్రత్యక్షమయ్యింది. ఇందేంటబ్బా అనుకుని రమేష్గాడిని అడుగుదామని వాడి ఎక్స్టెన్షన్ కి ఫోన్ చేసా...

"అన్ని లైన్లూ డిశంబరు 22 వరకూ బిజీగా వున్నాయ్ మూసుకుని డిశంబరు 22 వరకూ ఆగి ట్రై చేయండి"

అని ఆటోమెటిక్ వాయిస్ వచ్చింది. ఇదంతా మా మేనేజర్ వెధవ పనే (మేనేజరు వెధవపనే/ మేనేజరువెధవ పనే ఇలా రెండువిధాలా చదువుకోవచ్చు) అని అర్ధమయ్యి అయినా టైం పదకొండే కదా అయ్యింది ఈలోగా చాయ్ కొడదాం అని లేచి వెనక్కి తిరిగా...అక్కడ మా మేనేజర్ నిలబడున్నాడు జేబులోంచి రిన్ సబ్బు తీసి "ఉతుకుతా" అని సైగలు చేసి చూపించాడు .


ఇహ తప్పదని నేనూ మా టీము కదనరంగంలోకి దూకి "ఆపరేషన్ అతుకుల బొంత" అనే కోడ్ నేం తో పని మొదలెట్టాం. కార్యరంగంలో దూకి స్తిరంగా వున్న కోడ్ ని ఎడా పెడా మార్చేసి పిచ్చ పిచ్చగా ప్రోగ్రాంలు రాసేసరికి కోడ్ అర్ధంకాక మా కంప్యూటర్లు వాంతులు చేసుకున్నాయి. అయినా ధైర్యంకోల్పోకుండా గూగుల్లోనూ నెట్ లోనూ అక్కడక్కాడా దొరికిన కోడ్ ని తీసుకొచ్చి మా కోడ్ లో అతికించేసి...అతికించిన ప్రతి లైనుకీ ఒక పేజీడు కామేంట్లు రాసేసి...మొత్తానికి అయ్యిందనిపించాం.


శుభదినం రానే వచ్చింది..ఆరోజు డిశంబర్ 22, సూట్కేస్ లో అడుగునెక్కడో వున్న వెంకటేశ్వరస్వామి ఫోటొ తీసి జేబులో పెట్టుకుని ఆఫీసుకు బయల్దేరా...మద్యాహ్నం 2 గంటలకి కొత్తకోడ్ ఇన్స్టాలేషను..టైం దగ్గరపడేకొద్దీ బీపీ పెరిగిపోయి కాళ్ళూ చేతులూ వంకర్లుపోతున్నాయ్...రమేష్గాడు టెన్షన్ తో తనగోర్లు ఎప్పుడో కొరికేసుకుని అవి అయిపొయాకా కనిపించిన ప్రతీవోడి గోర్లు కొరికే పన్లోవున్నాడు.

సరిగ్గా 2 అయ్యింది.

'ఏడు కొండలవాడా వేంకటారమణా...గోయిందా గోయింద ''

"ఆపదమొక్కులవాడా......... "

అని పారవస్యంతో భక్తులు రిషి,రమేష్,బాబ్,క్రిస్టోఫర్,విలియం డేవిడ్సన్లు గొంతులు చించుకుని అరుస్తుండగా ఇన్స్టాలేషను కార్యక్రమం పూర్తయ్యింది.


ఆపరేషన్ "అతుకుల బొంత" విజయవంతంగా పూర్తిచేసినందుకు ఒకడి వీపు ఇంకొకడు గోకి మా టీం అంతా పరస్పర అభినందనలు తెలుపుకున్నాం.ఈలోగా మా మేనేజర్ వొచ్చాడు...కంగ్రాట్స్ చెప్తాడేమోననుకుని అందరం వరసగా చొక్కాలు పైకెత్తి వీపులు చూపించాం, ఆయన కంగారు పడి అబ్బే ఇప్పుడుకాదు టైం లేదు..వచ్చేవారం మీటింగ్ పెట్టి తీరిగ్గా గోకుతా అని..మీకో గుడ్ న్యూస్ అన్నాడు.

'గుడ్ న్యూసా ...చెప్పండి సార్ చెప్పండి అని అందరం బాస్ చుట్టూ మూగేసాం'.

'రేపట్నుంచీ మీరు ఆఫీసుకి రానవసరం లేదు ' అని ఒక్కక్షణం ఆగి ఇంకా ఏదో చెప్పాబోయేడు.

ఇంతలో రమేష్ గాడు కిందపడి గిలగిలా తన్నుకుంటూ..'సార్ అంతమాట అనకండి సార్..నాకు 2096 వరకు EMI లు ఉన్నాయ్ సార్ అవి కట్టకపొటే బ్యాంక్ వాళ్ళు నన్ను చంపి నాకు ష్యూరిటీ ఇచ్చిన రిషి గాడిని కూడా చంపేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు సార్...నన్ను అన్యాయం చేయకండి సార్ మేము 'రాజమండ్రిలో' కడుతున్న డబుల్బెడ్రూం ఫ్లాట్ కి 'రాబర్ట్ బ్లాంకెన్ హొర్న్ నివాస్ 'అని మీపేరే పెట్టుకుంటా సార్ ' అని ఏడవటం స్టార్ట్ చేసాడు.

మా మేనేజర్ కంగారుపడి 'రేయ్ ఆగరా నన్ను పూర్తిగా చెప్పనివ్వరా ...'అన్నాడు, అయినా రమేష్గాడు వినకపోయే సరికి నావైపు చూసి ఏదో ఒకటిచేసి వాడ్నాపరా బాబూ అన్నాడు.

నేను వెంటనే 2007 లో వుతికిన నా కర్చీఫ్ తీసి వాడి నోరునొక్కేసా...నిమిషంలో వాడు స్పృహ తప్పి పడిపోయాడు.

మా మేనేజర్ నావైపు చూసి గుడ్ జాబ్ అని చెప్పి, రేపట్నుంచి జనవరి 2 దాకా మీకు సెలవలు, రేపొక్కరోజు ఇంట్లో నుంచి లాగిన్ అయ్యి పనిచేయండి...బైదవే బయట హెవీ గా మంచు కురుస్తుంది వెళ్ళేప్పుడు జాగ్రత్త..బై అనేసి..వెళుతూ వెళుతూ రమేష్గాడి మొహం మీద కాసిన్ని నీళ్ళు జల్లిపోయాడు...


'మంచు ' అనే పదం వినపడే సరికి నేను ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టనిపించింది..మంచంటే నాకు చాలాఇష్టం..అసలు స్నో ఎప్పుడు పడుతుందా అని వింటర్ మొదలైనప్పటినుంచీ ఎదురుచూస్తున్నాను..ఈవాల్టికి మంచుదేవుడు నన్ను కరుణించాడన్నమాట...అర్జంటుగా మంచులో దొల్లేసి డాన్సులు చేయాలనిపించింది..'


రెండునిమిషాల్లో అన్నీ సర్దేసి..రమేష్గాడి రెక్కపుచ్చుకుని ఈడ్చుకుంటూ బయటకొచ్చేసరకి ........అహా పూల వర్షం మంచు పూల వర్షం..ఆకాశానికి చుండ్రుపట్టినట్టు తెల్లగా రాలుతూ వుంది..ఎక్కడ చూసినా తెలుపే...
ఇంక ఆగలేను..అనుకుని 'ఆకాశంలో ఆశల హరివిల్లు......అనాందాలే పూచిన..' అని పాడుకుంటూ స్వర్నకమలంలో భానుప్రియలా ఎగురుకుంటూ మంచులోకి పరిగెట్టాను....రెండు అడుగులు వేసానోలేదో........


'సర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్..' ( భూమికి రెండు అడుగుల ఎత్తులో గాల్లో వున్నా..అని తెలుస్తూంది)

'దా......బ్' (అడుగు మందంలో పేరుకుపోయిన మంచుని చీల్చుకుని నేలకు కరుచు కున్నా)

'ఫట్..టపక్..దడక్' ( లాప్ టాప్ చివరిక్షణాలు..)


*************అందరికీ క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు*************