Friday, September 12, 2008

బెంగులూరు-చందమామ-రాజమండ్రి

2007 వ సంవత్సరం.....ఒక రోజు...

సాయంత్రం బడి అయిపోయింతర్వాత..బుద్దిగా ఇంటికెళ్ళిపోయే పిల్లాడిలా లాంగ్ వీకెండ్ కి ..మా ఇంటికెళ్ళడానికి రాజమండ్రి బండెక్కేసా...బండి కదిలింతర్వాత జరగబోయేదేంటో..నాకు బాగా తెలుసు కాబట్టి..వెంటనే నిద్దరోయా.

ఇక్కడ కొన్ని జనరల్ నాలెడ్జి కొచ్చిన్లు..

1.ఇండియా కేపిటల్ ఏది ? ఆ: డిల్లీ

2.మూడు రెళ్ళెంత ? ఆ: ఆరు

3.బెంగులూరు టు వైజాగ్ వయా రాజమండ్రి APSRTC వాల్వో బస్సులో ఏ సినిమా వేస్తారు ?

ఆ: ఆ మాత్రం తెలీదా!! చందమామ, చందమామ..చందమామ.


నా సుడి మామూలు సుడి కాదు..వట్రసుడి...ఈ సినిమా గత 10 ట్రిప్పులో 30 సార్లు చూసా...బస్సు డ్రైవర్లు, అటెండెంట్ కుర్రాడు మారతారు తప్ప చందమామ మారే ప్రసక్తే లేదు. ఆ సినిమాలో యాక్ట్ చేసినోళ్ళంతా..మా చుట్టాలు అన్నంతగా..నా నర నరాన చందమామ సినిమా జీర్నించుకుపోయింది...

..........


'ట్వింకిలి ట్వింకిలి లిట్ట్లేస్టార్...హవ్వై వండరు వా...' ఎవడో నిక్రుష్టుడి రింగ్ టోన్ చెవుల్లో పొడిచేస్తుంది..

తెల్లారింది..కిటికీలోంచి చూసా..ఇంకా రాజమండ్రి రాలా.


ఫొన్ అరుస్తూనేఉంది ...వాడి రింగ్ టొన్ దెబ్బకి బస్సులొ అందరి మత్తూ దిగిపొయింది..ఆ దరిద్రుడు మాత్రం పడుకొనేఉన్నాడు.

నా పక్కసీట్లో అతనికి 'టాంక్ '..ఫుల్ టాంక్ అయ్యిందనుకుంటా..నిండుకుండలా..బాడీ కదపకుండా తల మాత్రం తిప్పుతున్నాడు..


మళ్ళీ..జనరల్ నాలెడ్జి..

ప్రశ్న: ఒక సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలుంటాయ్ ..?

తిక్క ప్రశ్న...ఒప్పుకుంటాను..కానీ ఈ ప్రశ్న కి నాకు మాత్రమే ఆన్సర్ తెలుసు.

ఆన్సరు : ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలుంటాయ్ ...ఒకటి మామూలు సంవత్సరం..రెండోది..బెంగుళూరు నుంచి రాజమండ్రి చేరటానికి పట్టేది.

.................................

రాజమండ్రి స్టేషన్లొ బండి ఇంకా ఆగనేలేదు..నా పక్కసీటోడు..మాయం.

లగేజ్ తీస్కోని..లగేజి తీసిచ్చిన కుర్రోడికి పది పడేసి..కదిలా..

'ఇదిగో అబ్బాయ్...ఇదిగో నిన్నే..'

'ఏంటండీ...'

'నిన్ను కాదు ...ఆ రిక్షా అతన్ని..' చెప్పింది నాతోపాటే దిగిన ముసలావిడ రిక్షా వాడిని పిలుస్తూ.

దిమ్మతిరిగిపోయి .............ఏం చెయ్యాలో అర్దంకాక ...రోమింగ్ లేని నా ఫొన్ లో మా నాన్న తో మాట్లాడ్డం స్టార్ట్ చేసా.

2 నిమిషాల తర్వాత ఒక ఆటో నా ముందాగింది..

రాజమండ్రి లో ఆటో డ్రైవర్లు మాట్లాడరు...జస్ట్ మనవైపు చూస్తారు..మనమే మాట్లాడాలి.

'రంగారావ్ గారింటికి....వెళ్ళాలి ' కర్మ ...మళ్ళీ చందమామ ఎఫెక్టు..

'కాదు....పి అండ్ టి కాలని '

నిమిషం ఆలోచించి ...మెడ ఇలా ఎగరేసాడు..

నీ పిండం పెట్టా...అలా మెడ ఎగరేస్తే అర్దమేంట్రా ..మెడనెప్పా? వస్తావా? రావా?..అడుగుదామనిపించింది.

ఇంతలో వాడే...ఎక్కండి..అన్నాడు.

........ఉదయం ఎనిమిదిన్నరకి రాజమండ్రి ఇంకా నిద్రపోతూ ఉంది...చల్లగాలి...కంబాలచెర్వు కంపు...మనసు హాయి గా ఉంది.

మా వీది మొదట్లో ...చిన్న వినాయకుడి గుడి..రోడ్డుకి అడ్డంగా పెద్ద పందిరి ..అందులో 2 పెద్ద సౌండ్ బాక్సులు ...10 కుర్చీలు...ముగ్గురు పిల్లలు అందులో ఒకడికి బోసిమొల..ఇంకా ఒక పంతులు..చాలా సందడిగా ఉంది.

'జర జూము జూము...జర జూము జూము..జర జూం' ...హిమేష్ రేషిమియా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు...గుళ్ళో.

ఆటో 360 డిగ్రీల కోణంలో ..అక్కడకక్కడే రివర్స్ తిప్పేసి..ఇక్కడనుంచి నీచావు నువ్వు చావు అన్నట్టు చూసాడు నా వంక ఆటో వాడు..

దిగి ఇంటేపు నడవడం...మొదలెట్టా...

'జర జూము...' రేషిమియా ఇంకా ఏడుపు ఆపలేదు.

'చీ..హెయ్ ..హెయ్..అవతలకి పో....'
మనల్ని కాకూడదనుకుంటూ ...పక్కకి చూసా..

'డాబా వాళ్ళింట్లో ముమైత్ ఖాన్ మొక్కలు తినేస్తుంటే...బయటకు..తోలుతున్నారు.'

కొమ్ములు కిందకివంగి ఉన్న ఏ గేదైనా..నాకు ముమైత్ ఖాన్ తో సమానం.

మా ఇల్లొచ్చేసింది.....మా అపార్ట్మెంట్ కింద కుర్చీ వేసుకుని ఒక మినిస్టర్ గారు పేపర్ చదువుకుంటున్నారు....ఆయన మాకు వాచ్మేన్ అవుతారు...వాడు చేసే ఒకే ఒక్కపని జీతం తీసుకోడం. ఆయనికి డిస్ట్రబెన్సు లేకుండా....మైన్ గేటు ఎడమ కాలితో గట్టిగా తన్ని ...తిరిగి గేటు మూయకుండా పద్దతిగా మెట్లెక్కి పైకొచ్చా...

'ఇప్పుడు మనం తెలుసుకోబోయే పదకొండవ సందేహము..తిండి మానేస్తే బరువు తగ్గుతారా...అది కేవలం మన అపోహ మాత్రమే'...అదొక టైపు గొంతుక

టీవీ లో 'మంతెన సత్యనారాయన రాజు గారి కార్యక్రమం'......నాన్నమ్మ, నాన్న గారు చూస్తున్నారు.

'ఇదిగో విజయలక్ష్మీ ...రిషి గాడొచ్చేసాడు ' వంటింట్లో అమ్మకి, వీధిలో వాళ్ళకి ..అందరికీ కలిపి ఒకేసారన్నట్టు పెద్ద కేక పెట్టింది మా నాన్నమ్మ.

నాన్న....మాట్లాడలేదు గానీ..ఒక నవ్వ్వు మాత్రం నవ్వారు. బహుసా... 'మంతెన ' గారి ఎఫెక్ట్ కావచ్చు.

'ఏరా..దిగింతర్వాత ఫొన్ చెస్తే నాన్న వచ్చును కదా...స్టేషన్ కి ' -అమ్మ .

'ఆ గెడ్డం ఏంట్రా వెధవా...రిక్షా వాడిలాగ..' ప్రేమగా కుక్కపిల్లని దువ్వినట్టు చేత్తో నా తల దువ్వింది నాన్నమ్మ.

'రాత్రేమైనా..తిన్నావా...' అడిగింది మళ్ళీ

'ఆ... తిన్నా...'

'తినకు..తినకుండా..అటూ ఇటూ తిరుగు.. ...అందుకనే అలా ఈనుప్పుల్లలా ఉన్నావ్'

( మా నాన్నమ్మ సౌండ్ ఇంజనీరింగ్లో ఎమ్మే చెసింది..మనం చెప్పేది వినిపడదు )

'తిన్నాడంటండీ .....' మద్యలో కల్పించుకుంది అమ్మ.

ఇప్పుడు మళ్ళీ జనరల్ నాలెడ్జీ కార్యక్రమం...

ప్ర: 'స్రుష్టిలో తియ్యనిది....... ?
ఆ: స్నేహం,..ప్రేమ..........బూడిద,బంకమట్టి ఇవేవీ కాదు....

స్రుష్టిలో ఏదైనా తియ్యగా ఉందీ అంటే ...అది కచ్చితంగా మా అమ్మ చేసే 'టీ' మాత్రమే...దానికి తిరుగులేదు.

మా అమ్మ ఫార్ములా అలాంటిది మరి....ఒక స్పూను పాలు, 3 స్పూనుల నీళ్ళు ...6 గరిటెల పంచదార.

అమ్మా....దువ్వన ఎక్కడుంది ?

..ఆ టీవీ పక్కనుంటుంది చూడు .....

మా అమ్మ ఇచ్చిన 'ఫార్ములా' తాగి.....దువ్వెనతో నాలికని బర బరా..బరుక్కుంటూ..బాల్కనీ లో నిలబడ్డా....

బయట ఇందాకంత రణగొణలు లేవు..హిమెష్ రేషిమియా ఏడ్చి ఏడ్చీ ...నిద్రపోయినట్టున్నాడు.

'స్నానం చేసెయ్యరా..ఫ్రీ గా ఉంటాది..జర్నీ చేసావ్ కదా' - నాన్నగారు

టవల్ కట్టుకున్నాను కదా....ఫ్రీగానే ఉంది...అన్దామనిపించింది...

నాన్న వదిలినా...మా ఇంజనీరు వదలదు ...ఈ సారికి సరెండర్ అయిపోదామని .....బాత్రూంలోకి వెలుతూంటే...

'ఇదిగో రిషి గాడికి టీ ఇచ్చేవా'..మా అమ్మని అడుగుతోంది నాన్నమ్మ..

'నేను టీ మానేసాను ' .....గట్టిగా అరిచి తలుపేసుకున్నా...


...............................

స్నానం చేసి వచ్చి..మా నాన్నమ్మ పక్కన కూలబడ్డా..

బయట ఏదో హడావిడి...వినాయకుడి గుళ్ళో మళ్ళీ ఎవడిదో ఏడుపు....

'పొద్దున్లెగాలి ....స్నానం చెయాలీ..పిఎంటి కాలానీ భక్త మహాశయులకు విజ్ఞప్తీ ....జిల్ జిల్ జిగా...జిల్ జిల్ జిగా....కాలనీ వినాయకుని నిమజ్జనం సందర్బంగా ......జిల్ జిల్ జిగా...జిల్ జిల్ జిగా....'

'హేపీడేస్ పాట.. ప్లస్... భక్తులకి విజ్ఞప్తి' రీమిక్స్..మంచి టాలెంటెడ్ DJ.

'జిల్..జిగ.......రేపు మద్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం జరగబోతున్నది....కావున..బాత్రూం లో పాటలు...

బ్రేక్ ఫస్ట్ లో బాటలు ......అందరూ సహకరించి తోచినవిదంగా....ఇక బస్సులకయ్ వైటింగూ....బియ్యం మరియు '

'మీ...మట్టి,మశానం......ఆపండరరెయ్....' అప్ర్యత్నం గా పైకే పెద్దగా అరిచా..

'నేను ఇందాకే తిన్నా.....నువ్వు తిన్నావ్రా రిషిగా...' నా అరుపుకి సమాదానంగా అంది నాన్నమ్మ.

'ఏంటి....'

'నాకు పొద్దున్న ఎనిమిది కల్లా పడిపోవాలి...మాత్రలు వేసుకోవాలి కదరా...'

'ఏం పడాలే ...'

'తలకి కొబ్బరినూనె రాయనా......'

మా సౌండ్ ఇంజనీర్ తో..నా తిప్పలు చూసి..నవ్వుకుంటూ మా అమ్మ దగ్గర్కి పరిగెట్టాడు మా నాన్న.

.........................

బెంగులూరు నుంచి రాజమండ్రి సంవత్సరం పాటు ...జర్నీ చేసి..వచ్చిన అలసట...నీర్సం గా రూపాంతరం చెంది...కొబ్బరి నూనె సీసా మా నాన్నమ్మ చేతిలో పెట్టి...నా తల అప్పగించి .......కళ్ళు మూసుకున్నాను..

దూరంగా...గుళ్ళో ఎవడిదో కొత్త ఏడుపు.....
'ఆ..సత్తే ఎ గొడవా లేదు..సత్తే ఎ గొడవా లేదు..'...ముదురు ఏడుపు......

29 comments:

RG said...

బస్సు దిగి "రంగారావు గారింటికెళ్ళాలి" అని అడగడం కెవ్వు... మేష్టారూ మీరు వైజాగూ-బెంగళూరు బస్సుకి రెగ్యులర్ పాసెంజరన్నమాట, అయితే మనం బస్సులో కలిసే ఛాన్సులు బానేఉన్నాయి :)

Purnima said...

Hilarious! :-))

కొన్ని లైన్స్ అయితే మరీను. టైటిల్ చూసి, బెంగులూరు నుండి హైద్ నుండి వస్తుండగా పున్నమి చంద్రుడో, చక్కని చుక్కో అని ఒక రొమాంటిక్ పోస్ట్ అనుకున్నా! హమ్మ్.. కాని ఇది ఇంకా బాగుంది.

హిమేష్ హైలైట్, చక్రీ మరీ! :-))

బాగా రాస్తున్నారు. కొనసాగించండి

సుజ్జి said...

comedy adirindi.. chaala baaga rasaru. :)

GIREESH K. said...

very nice :))))))

teresa said...

ఆ దరిదృడెంత అదృష్టవంతుడో, అంత హాయిగా నిద్దరోటానికి! 'ఈనుప్పుల్ల' అంటే ఏవిటీ?

Anandakiran said...

writinstyle,flow of words are superb.
but what is fault of momaith khan

రాధిక said...

మీరు భలె రాస్తున్నారు.మీరు రాజమ....అనగానే నేను ఎక్కడికోవెళ్ళిపోయాను.బస్సులోపాట్లు,బామ్మతో పాట్లు చక్కగా రాసారు.తెగ నచ్చేసింది మీ పోస్టు.

చైతన్య.ఎస్ said...

రిషి గారు మీ జి.కె ప్రశ్నలు బాగున్నాయి.ముమైత్ ఖాన్ ఇంకా సాంగ్స్ అదుర్స్.

బుజ్జి said...

మా ఇల్లొచ్చేసింది.....మా అపార్ట్మెంట్ కింద కుర్చీ వేసుకుని ఒక మినిస్టర్ గారు పేపర్ చదువుకుంటున్నారు....ఆయన మాకు వాచ్మేన్ అవుతారు...వాడు చేసే ఒకే ఒక్కపని జీతం తీసుకోడం. kooda baagundi..

Srikanth said...

'రంగారావ్ గారింటికి....వెళ్ళాలి ' కర్మ ...మళ్ళీ చందమామ ఎఫెక్టు.

హిమేష్ రేషిమియా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు...గుళ్ళో.
-నాకు నచ్చిన డైలాగులు

బగుంది మీ టపా

సుజాత వేల్పూరి said...

బాబూ,
చించేశారు! అద్భుతంగా ఉన్నాయి!
హిమేష్ రేషమియా,
మొమైత్ ఖాన్,
రంగారావు గారింటికి వెళ్ళాలి,
సృష్టిలో తీయనిది,
హాపీడేస్ రీమిక్స్ పాట....what not, every thing is just excellent!
చేగోడీలు తిన్నట్టే ఉంది! Superb

go ahead!

సిరిసిరిమువ్వ said...

మీ టపాలు చెగోడీలంత రుచిగా ఉంటున్నాయి, ఈ టపా మరీను.

అమ్మ ఇచ్చిన 'ఫార్ములా' తాగి.....దువ్వెనతో నాలికని బర బరా..బరుక్కుంటూ...అర్థం కాలా!!!

Unknown said...

వావ్! కామెడీ పండించి వండి వార్చేసారుగా ?
మాంచి కరకరలాడే చేగోడీలు మా పంటి కింద పడేసి ఆ చేత్తోనే మన రాజమండ్రి ట్రిప్పోటి వేయించేసారు...
భేష్...

Anonymous said...

రిషి గారు...చాలా చాలా చాలా బాగుంది.
ఈ మధ్య కాలంలో నేను ఇంతగా నవ్వలేదు.

ఇప్పటికి 4 సార్లు...చదివాను ఈ పోస్ట్.

ప్రతీ లైనూ అదరగొట్టి పడేసారు.
ఒక్క మాటలో చెప్పాలంటే..సింప్లీ సూపర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్..........

-రమ

Madhu said...

కేక..మాస్టారూ..కేక.

'స్రుష్టిలో తియ్యనిదిస్నేహం,..ప్రేమ..........బూడిద,బంకమట్టి ఇవేవీ కాదు'

ఈ డైలాగు....అదుర్స్.

తెలుగు'వాడి'ని said...

గత కొద్దిరోజులలో వచ్చిన హాస్యపు టపాలలో ఈ టపా స్థానం సుస్థిరం. చాలా అధ్భుతంగా రాశారు. అభినందనలు. పద ప్రయోగాల చమత్కృతి నిజంగా సూపర్. మీ వ్యాఖ్యానమైతే నిజంగా అదుర్స్.

krishna rao jallipalli said...

అదీ. . టపా అంటీ ఇలా ఉండాలి.. వేరి వేరి నైస్.. మీ అమ్మగారి టీ రుచి చూడాలని ఉంది. నా కోరిక తీరే మార్గం??

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

చాలా బాగుంది ఈ టపా. నిజంగా చేగోడిలానే ఉంది.

Anonymous said...

chaalaa tasty gaa vundi mee chekoli
naaku lojooo kaavaaali :):):)

వేణూశ్రీకాంత్ said...

ఏదో అందరూ వ్రాస్తున్నారు కదా అని నేను మొదలు పెట్టా అంటూ అదర గొట్టేస్తున్నారు రిషీ... చాలా బావుంది.

కొత్త పాళీ said...

this one is well done too.

Anonymous said...

boss malli kotha tapa eppudu boss?

eesari kuda andariki amodayogyamaina tapa kosam vechi chustunnam....

murali....

siv... said...

chala baagundhi... mee raase saili...

Friend said...

హబ్బా..పొట్ట చెక్కలయ్యింది నవ్వీ నవ్వీ..:)))రెండు రెళ్ళు ఆరును గుర్తు చేసారు..Toooo Hilarious.

అభిజ్ఞాన

Anonymous said...

Chala late ga chusa me blog...chala comedy ga undhiii...full work tho tired ayyina time chadhiva...full ga navvukunnna....Very nice narration.keep going sir

kavitha,

AvanthiRao said...

hey meedi rjy maadi rjy mee narration chala bagundi bus digina daggara nundi intiki vellaka amma daaka anni same 2 same , ante maa nanamma nenu puttina ventane nannu chuse baghyam kattukuni poyinditalendi :)

Raji said...

my god intha gaa ee madhyakaalam lo eppudoo navvaledu.
mee anni stories chadivi okesaari comment raastunnaanu.
mee chathuratha samayaspoorti adbhutam.

csr said...

chala bagundi rishiji.

Unknown said...

Chala baga rasaru.meru manchi writer avutaru.best f luck.