Tuesday, May 19, 2009

పెళ్ళి - అనుభవం

అదిగో అదిగో ...టైటిల్ చూసి కంగారు పడకండి..ఇక్కడ "పెళ్ళి" నాది కాదు..కానీ "అనుభవం" మాత్రం నాదే...అదిగో అదిగో మళ్ళీ అపార్థం చేసుకుంటున్నారు.."అనుభవం" అంటే "పెళ్ళికెళ్ళిన అనుభవం" అని.....సరే ఇలాకాదుగానీ విపులంగా చెప్తా.. ఆరోజు అసలేం జరిగిందంటే..



మద్యాహ్నం ఫుల్లుగా తినేసి పక్కేసిన నాకు ...ప్రక్క గదిలో ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించడంతో సడెన్ గా మెలుకువొచ్చింది..కంగారుగా హాల్ వైపు పరిగెత్తాను..హాల్ లో అమ్మా,నాన్నమ్మా ఏడుస్తూ కనిపించారు...హడలిపోయి..ఏవయ్యిందీ అని గట్టి గా అరిచా...


ఏమీ చెప్పకుండా నోటికి చేతిని అడ్డంపెట్టుకుని బావురుమంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అమ్మ...నాన్నమ్మవైపు చూసా...'మహ్హ త్రుదేవోభా..' అని ముక్కు చీదుకుంటూ టీవీ వైపు చూపించింది నాన్నమ్మ.


టీవీ లో "మాతృదేవోభవ" సినిమా లో మాధవి ఏడుస్తూఉంది.....విషయం అర్ధమయ్యింది .....నాకు తిక్కరేగిపోయింది...


టీవీ ఎత్తి మా సెకండ్ ఫ్లోర్ లోంచి కిందకి పడేద్దాం అనే అలోచనని బలవంతంగా తొక్కిపెట్టి..డోర్ తీసి అక్కడున్న కటకటాలకేసి నా తలబాదుకున్నా...అక్కడ ' పోస్ట్ మాన్ కిందకూర్చిని కటకటాల్లోంచి సినిమా చూస్తూ ఏడుస్తూ కనిపించాడు ' .


ఇంకతట్టుకోలేక...గబ గబా కుర్చీ లాక్కుని ఫాన్ కి చీర ముడేయడం మొదలుపెట్టా....అయ్యో అయ్యో మొన్న దీపావళి కి మా అన్నయ్య పెట్టిన చీర అంటూ పరిగెత్తుకొచ్చి చీరలాక్కోంది మా అమ్మ. ఈ హడావిడితో లోకంలోకి వచ్చినట్టున్నాడు పోస్ట్ మాన్ ...కళ్ళు తుడుచుకుని.."పోస్ట్" అని గట్టి గా అరిచి ..ఒక కవర్ లోపలకి పడేసీ వెళ్ళిపోయాడు.



అది శుభలేఖ ...నా చిన్నప్పటి ఫ్రెండ్ శరత్ గాడి పెళ్లి ..అదీ రేపే..ఎప్పుడో పన్నెండేళ్ళ క్రితం చూసా వాడిని...కచ్చితంగా వెళ్ళాలి..వాడు నెల క్రిందటే ఫోన్ చేసి చెప్పాడు...అసలందుకనే బెంగుళూర్ నుంచి వచ్చింది. ఆల్రెడీ ఇంకో చిన్నప్పటి ఫ్రెండ్ తో మాట్లాడా ...వాడూ వస్తున్నాడు ..నేను రాత్రికి రావులపాలెం లో దిగితే అక్కడ్నుంచి వాడూ నేనూ కలిసి బండి మీద పెళ్లి కి వెళ్తాం...అదీ ప్లాను..



నీటుగా తయారయ్యి ...నేవెళ్తున్నా అని కేక వేసి బయలుదేరా....అమ్మా, నాన్నమ్మ..ఇంకా ఏడుస్తూనే వున్నారు..అప్పడే వచ్చిన మా పనమ్మాయ్ 'బాబు తొందరగానే వచ్చేస్తాడ్లే అమ్మా...ఈమాత్రందానికే కల్లనీళ్ళెట్టుకోవాలా' అంటోంది...


మళ్ళీ నేనెక్కడ తలబాదు కుంటానో అని మా నాన్నమ్మ తలుపుకి అడ్డంగా నిలబడింది....నేను ఒక వెర్రి నవ్వు నవ్వి ఇంట్లోంచి బయటపడ్డా..



కిటికీ పక్క సీటు..సాయంత్రం చల్ల గాలి...తెలీకుండానే నిద్రపట్టేసింది.


"సార్ మల్లె పూలు..సేమంతులు .." ఎవడో కిటికీలోంచి నా చేయి మీద కొడుతున్నాడు..ఉలిక్కిపడి లేచా...


'ఏరా..తిక్క తిక్క గా ఉందా..?నన్ను మల్లెపూలు కావాలా..అని అడుగుతున్నావ్' అన్నా...
సమాధానం గా..."బాబూ కొద్దిగా ఆ పూలందుకో అమ్మా.." అని పదిరూపాయలనోటు నా చేతికందించింది...లేడీస్ సీట్లో నుంచి ఒకావిడ.


మాట్లాడకుండా..అది పూలవాడి చేతిలో పెట్టి...పూలు తీసుకుని ఆవిడ చేతిలో పెట్టా..బస్సు కదిలింది.


మరి 'చిల్లరేదీ?' అంది...


ఓర్నాయనో ...వాడు చిల్లర ఇవ్వాలా..అనుకుని...బాబూ చిల్లరంట...అనిక్ కేకేసాను...


వాడు చిల్లర ఇస్తున్నట్టు నటిస్తాడు గానీ చిల్లర ఇవ్వడే...బస్సు స్పీడు పెరిగింది..నాకు టెన్షన్ పెరిగింది...వాడు స్లో మోషన్ లో పరిగెడుతున్నాడు...రెండు నిమిషాల్లో జరగాల్సింది జరిగిపోయింది..వాడు రెండు రూపాయల చిల్లర ఎగ్గోట్టేసాడు.


ఆవిడ నా వైపు చూస్తూ పూలవాడ్ని బండ బూతులు తిట్టి ఓ పాతిక శాపనార్థాలు పెట్టింది...


అత్త మీద కోపం దుత్త మీద చూపించబడింది...
అత్త = (నేను + పూలవాడు)


దుత్త= (ఆవిడ కొడుకు)


"సరిగ్గా కూచోరా ఎధవకానా..దభేల్ దభేల్...ధబెల్..." ఆవిడ పక్కన కూర్చుని జంతికలు తింటున్న కొడుకు వీపు విమానం మోత మోగింది... ఇంక నేను...నిద్రపోతున్నట్టు నటించడం మొదలెట్టా...


అలా ఓ గంట నటించింతర్వాత..రావులపాలెం వచ్చేసింది. దిగి..మా శ్రీను గాడి కోసం చుట్టూ చూసా...ఎవరూ కనిపించలేదు..అయినా వాడిని చూసి చాలాకాలం అయింది..నన్ను గుర్తుపడతాడో లేదో...అనుకుంటుండగా....చేతిలో చిన్న బ్యాగ్ తో ఒకతను నవ్వుకుంటూ నావైపే వస్తున్నాడు...
ఒక్కసారి నా చిన్ననాటి తీపి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి వొళ్ళు పులకరించింది...వాడు దగ్గరికి రాగానే ..


"ఎన్నాల్లయ్యిందిరా నిన్ను చూసి" అని గట్టిగా కౌగిలించుకున్నా..


"ఛీ ఏంటండీ ఇది...వదలండి...... రాజోలు బస్సు ఎన్నింటికీ అని అడుగుదామని వస్తే ఏంటిది....వదలండి వదలండి" అని విడిపించుకుని పారిపోయాడు.


బస్సు స్టాండ్ లో జనమంతా నన్నే చూస్తున్నట్టనిపించి.. ఏదో అర్జెంట్ పనున్నట్టు అక్కడున్న షాప్ కెళ్ళి సితార కొని అక్కడున్న బెంచీ మీద జారబడ్డా..'ఒరేయ్ బస్సు దిగిచచ్చా ...వచ్చి తగలడు ' అని మా శీను గాడి కి మెస్సేజ్ కొట్టి...సితార చదవటం మొదలుపెట్టాను.


కొంతసేపటికి స్టాండ్ లో జనాలు పల్చబడ్డారు....నేనూ ఇంకో నలుగురు పాసేంజర్సూ..ఇద్దరు పిచ్చోళ్ళు మిగిలాం.. కొంత సేపు అయినతర్వాత...నన్ను ఎవరో గమనిస్తున్నట్టనిపించి..ఆ వైపుకి చూసా....



' ఒకడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గోర్లు కొరుక్కుంటూ నా వైపే చూస్తున్నాడు ..' నేను వాడి వంక చూసేసరికి ...నవ్వి నావైపు నడవడం మొదలుపెట్టాడు..


లాభం లేదు...వీడెవడో తింగరి వెధవ నన్ను తగులుకుంటున్నాడు.....రాత్రి ఏడుగంటలకి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా మెంటల్ కేసే .. వాడ్ని గమనించనట్టు నటిస్తూ సితార చదివేస్తున్నా..


"కనులు కనులతో కలపడితే...ఆ తగవుకు ఫలమేమి"... నా ఎదురుగా నిలబడి అన్నాడు వాడు.


'నా గుండె గొంతుకలోకి జారిపోయింది...ఫస్ట్ టైం నా మీద నాకే అసహ్యమేసింది...ఎక్కడలేని పిచ్చి నాయాల్లంతా నాకే తగులుకుంటారు..అని మనసులో ఏడ్చి...' తల పైకి ఎత్తకుండా వాడి వంక చూడ్డానికి ట్రై చేశా...


"హలో ...కనులు కనులతో కలపడితే...ఆ తగవుకు ఫలమేమి" మళ్ళీ అన్నాడు ...


'నాకు తెలీదు రా...తింగరి వెధవా..అయినా నాకు ఇలా తగులుకున్నావేంట్రా..' అను గొణుక్కుంటూ వాడి వైపు చూసా...


హాశ్చర్యం...వాడే మా శీను గాడే... "ఇదేం అవతారం రా..తిక్కవెధవ..రాత్రిళ్ళు ఆ నల్లకళ్ళద్దాలు పెట్టుకుని పాత పాటలు పాడుకొవటమేంటిరా..పిచ్చిగానీ ఎక్కిందా...ఆ కళ్ళజోడు తియ్ ముందు..." నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ అన్నా...


"కనులు కనులతొ కలబడితే ...కళ్ళకలకొస్తుందిరా రిషిగా" అంటూ కల్లజోడు తీసాడు.


చింతనిప్పులా కళ్ళు..దానికితోడు పోకిరి హెయిర్ స్టైలూ ..కలగలిపి డ్రాకులా తెలుగు వెర్షన్ లా వున్నాడు శీను గాడు..
ఒక్కసారి కళ్ళు మండినట్టనిపించి..."ఒరేయ్ నువ్వర్జంటుగా ఆ కళ్ళజోడు పెట్టేస్కో..పాటలు మాత్రం పాడొద్దు.." అని చెప్పి వాడిని బయలుదేరదీసా..


వాడు బండి నడుపుతూ వాడికి వాడి గర్ల్ ఫ్రెండు నుంచి కళ్ళకలక ఎలా అంటుకుందో చెపుతుంటే..నేను ఎనక కూర్చుని 'ఊ..' కొడుతూ అలా అలా..ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ..మొత్తానికి మా శరత్ గాడి ఇంటికి చేరుకున్నాం..


మేం వెళ్ళేసరికి పెళ్ళిసందడి మొదలయ్యింది..ఇల్లంతా పల్లెటూరి పెళ్ళి కళతో సందడిగా ఉంది...ఎక్కడ చూసినా జనాలే జనాలు.
బయట అరుగు మీద ఆడుకుంటున్న పిల్లగాడ్ని పిలిచి..శరత్ ఉన్నాడా అని అడిగాడు మా శీనుగాడు..
"సెత్తన్నయ్యా....నీ కోసరం ఎవరో వచ్చారు ' అని ఓ గావుకేక పెట్టాడా కుర్రోడు..


నాకు మతిపోయి 'సెత్తన్నయ్యేంట్రా...' అన్నాను, నువ్వు కంగారు పడకురా..వాడు శరత్ అన్నయ్యా అని స్పీడుగా అన్నాడు..ఎక్స్ ప్లెయిన్ చేసాడు శీనుగాడు...



ఇంతలో 'మా చెత్త బాబు పెళ్ళికొచ్చారా..రండి ' అని గుమ్మంలో రెండు కుర్చీలు పడెసేడు ఓ ముసలాయన లోపలినుంచి వచ్చి....ఇక్కడ శరత్ గాడిని అందరూ స్పీడు గానే పిలుస్తారన్నమాట..అనుకుని కూర్చీ లాక్కోని కూర్చున్నా.



వాతావరణం చాలా బావుంది..ఏ మాటకామాటే చెప్పుకోవాలి...పల్లెటూర్లో ఉన్న ప్రశాంతత ఇంకెక్కడా వుండదురా అన్నాను మా శీను గాడితో...ఇలా అన్నానో లేదో...'బాబా సాయి బాబా..నీవు మావలె మనిషివని ' అని చెవులు పగిలిపోయేట్టు పక్కనున్న గుడి మైకులోంచి పాట మొదలయ్యింది..


హా హా నిజమేరా...అన్నాడు శీను గాడు.


ఇంతలో మా శరత్ గాడు వచ్చి...నన్ను గట్టిగా వాటేసుకుని కుశలప్రశ్నలడిగి..శీను గాడ్ని మాత్రం..దూరం నుంచే మాట్లాడి నీ కలక నాకు మాత్రం అంటించకురా..అని బ్రతిమలాడి..


'అరేయ్...మీరు ముందు భోజనాలు చేసి రండి ' అని చెప్పి మాకు అన్నీ దగ్గరుండి చూడమని ఒకడిని పురమాయించాడు.


పర్లేదు మేం వెల్తాం అని..ఆఒకడిని వద్దని చెప్పి..మెల్లి గా మేమే బయలుదేరాం.సందు మలుపు తిరగ్గానే చాలా మంది జనం ఇద్దరు ఇద్దరు బాచ్ లు గా కుస్తీ పట్లు పడుతూ కనిపించారు..


అరేయ్ చూసావా ఇలాంటివి పల్లెటూర్లలోనే జరుగుతాయ్...కొంచెంసేపు చూసెళదాం ఆగు అన్నా సీనుగాడితో..


ఏడిసావ్...అవే భోజనాలు...ఇప్పుడే బంతి లేచినట్టుంది..సీట్లకోసం జనాలు తోసుకుంటున్నారు...పద మనమూ కూర్చుందాం అని పరిగెత్తాడు. నేనూ వాడివెనకే పరిగెత్తా కానీ అలవాటులేక పద్మవ్యూహం లో చిక్కుకు పోయిన అభిమన్యుడిలా జనాల మధ్యలో చిక్కుకుపోయా..ఎలాగోలా తప్పించుకుని లొపలికి వెళ్ళేసరికి జుట్టురేగిపోయి ముక్కుపగిలిపోయిన స్తితిలో సీనుగాడు కనిపించాడు..


'ఒరేయ్ ఈ బంతిలో కూచుందామనుకుంటే బంతాట ఆడేసార్రా..పద అందాకా అక్కడ కూర్చుందాం' అని లొపల్నుంచి ఎత్తుకొచ్చిన రెండు కాజాలు ఇచ్చాడు...అవి తింటూ కబుర్లు మొదలెట్టాం..


అప్పుడే భోజనలానుంచి బయటకొచ్చిన ఒకావిడ హడావిడిగా మా శీనుగాడి దగ్గరకొచ్చి టైం ఎంతయ్యింది బాబూ అని అడిగి..వాడు చూసి చెప్పేలోపులో వాడి చెయ్యిని వంకర తిప్పేసి టైం చూసుకుని .."హా కంగారులేదు ఇంకా టైం ఉంది" అని అనుకుంటూ మళ్ళీ లొపలికి పరిగెట్టింది..


అక్కడికి ఏదో ఆవిడ వాచీ నేను పెట్టుకున్నట్టు ....ఇదేం టైం అడగటం రా బాబూ..అన్నాడు శీను గాడు మెలితిరిగిన చెయ్యిని సరిచేసుకుంటూ.


'మిగతా హడావిడి లో పడి పెళ్ళి ముహూర్తం టైం మర్చిపోతారేమో అని ఇలాంటి పని ఒకళ్ళకి అప్పచెబుతారు పెళ్ళిళ్ళలో ' నాకు తెలిసింది కొంత.. తెలీంది కొంత కలిపి చెప్పా..


చాలాకాలం తర్వాత పూర్తి పల్లెటూరి వాతావరణంలో సాంప్రదాయంగా కొబ్బరాకుల పందిరిలో జరుగుతున్న పెళ్ళి చూస్తున్నాను..ఈ భోజనాలు, బందువుల డావిడి..కొద్ది దూరంలో పందిర్లో అప్పుడే మొదలెట్టిన భజంత్రీలు...మన్సులో ఒక తెలీని ఆనందం.


'ఏరా శీనుగా మాకు పప్పన్నం ఎప్పుడెడతావ్రా'..అన్నాడు అప్పుడే సుష్టుగా భోజనం చేసొచ్చి బ్రేవ్ మని తేలుస్తూ ఓ పెద్దాయన.


అలా తోటలో ఓ నాలుగు రౌండ్లు తిరిగి రండి..మళ్ళీ మాతో పాటూ తిందిరిగాని...నా పప్పు అంతా మీకే.. అన్నాడు మా శీను గాడు ఇకిలిస్తూ.. శీనుగాడి వీపుమీద నాలుగు దెబ్బలేసి పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడాయన.


నిజంగా పల్లెటూర్లలో ఉండటం ఒక వరం...ఆ ఆప్యాయతలు, పలకరింపులు...సరదా సరదా వెటకారాలూ..ఓహ్ నిజం గా నేను ఇవ్వన్నీ మిస్ అవుతున్నా రా....మీకు మాత్రం పల్లెల్లో ఉండటం ఒక వరం ..అన్నాను శీను గాడితో.


'క్షవరమా...మొన్నె మా వూర్లో చేయించారా..బాగ సెట్టయ్యింది కదా ' అన్నాడు శీనుగాడు..నా వరం అనేమాట క్షవరం గా అర్ధమచేసుకుని..


నవ్వాలో ఏడవాలో తెలీక 'తలపట్టుకుని ' కూర్చున్నా నేను.


ఇందాక టైం అడిగినావిడ మళ్ళీ భోజనాల్లోంచి హడావిడిగా బయటకు రావడం చూసి "రేయ్ ఇవ్వాళ నా చెయ్యి కి బ్యాడ్ టైం లా వుంది" అని వాచీ తీసేసి జేబులో పెట్టుకుని "ఎనిమిందింపావు" అని గట్టిగా అరిచాడు మా వాడు.


అంతే... భోజనాలు జరిగేచోట ఒక్కసారిగా కలకలం రేగింది..ఆడాళ్ళందరూ ఎక్కడివక్కడ వదిలేసి పెళ్ళింటివైపు పరుగులు పెట్టడం మొదలెట్టారు. కొందరు "అయ్యో అయ్యో ..ఎనిమిదింపావంట తొందరగా తెమలండి" అని కగారుపెట్టేస్తున్నారు మిగతావాళ్ళను.


చూసావు రా..పెళ్ళి అంటే ఇలా ఉండాలి..ముహూర్తం దగ్గర పడుతుందని అందరూ ఎలా హడావిడి పడుతున్నారో చూసావా...అదే సిటీస్ లో అయితే శుభ్రంగా తినేసి పెళ్ళికొడుక్కో షేక్ హాండ్ పడేసి పోవటమే...అన్నాను.


"కానీ పెళ్ళి రాత్రి పదిన్నరకి రా...అయినా ఉండు ఇప్పుడే వస్తా " అంటూ అక్కడ పరిగెడుతున్న ఆడాళ్ళకి అడ్డంగా పరిగెట్టి ఒక చిన్నపిల్లని పట్టి తీసుకొచ్హేడు శీను గాడు.


పెళ్ళి ఎన్నింటికి ? అడిగాడు ...ఏమోనండీ... నాకు తెలీదండీ..నేను వెళ్ళాలండీ.. అని తుర్రుమంది ఆ పిల్ల.


సరే మనమే చూద్దాం పదరా...ఒకవేళ పెళ్ళికి ముందు జరిగే కార్యక్రమాలు ఏమైనా వున్నాయేమో...అలాంటివి అస్సల్లు మిస్ అవ్వకూడదు..పద అని వాడిని బయల్దేరదీసి పెళ్ళింటికి వెళ్ళాం.


ఇంటిముందు పందిరిలో ఎవరూ లేరు...ఇంటి హాలు మాత్రం హౌస్ ఫుల్....


ఏం జరుగ్తోందండీ....టెన్షన్ తట్టుకోలేఖ గుమ్మంలో ట్యూబ్ లైట్లు కడుతున్న ఒకతన్ని అడిగేను..


అతను చెప్పే లోగా ...'మొగలి రేకులు...మొగలి రేకులు ' అంటూ టీవీలో పాటమొదలయ్యింది...


పదే పదే ఆవిడ టైం ఎందుకడిగిందో అర్థమయ్యి ..మైండు బ్లాకయ్యి..కళ్ళలో రక్తం కారుతుండగా...నిశ్శబ్ధంగా మళ్ళీ భోజనాలు జరిగే చోటుకు చేరుకున్నాం.


ఈసారి కష్టపడకుండానే శీనుగాడు రెండు కుర్చీలు సంపాయించాడు..మాదే చివర రౌండనుకుంటా పెద్దగా ఎవరూ లేరు..వడ్డన మొదలయ్యింది..వంటలు రుచిగాఉన్నాయ్..అందరూ బాటింగ్ బాగా చేస్తున్నారు...పావుంగంటయ్యింతర్వాత కొంత మంది ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి వెళ్ళిపోయారు...మా శీనుగాడికి, "వంకాయ్ జీడిపప్పు" వడ్డించేవాడికి హోరాహోరీ పోరు చివరిదాకా రసవత్తరంగా సాగి చివరకు వడ్డించేవాడు విరక్తితో ఉరేసుకునేదాకా వెళ్ళటంతో ముగిసింది...


తర్వాత ఆకులో మిగిలిన కిళ్ళీ లు నములుతూ పండువెన్నెల్లో కూచుని మా 'శరత్ ' గాడి పెళ్ళి చూసి వెనక్కు బయలుదేరాం...శరత్ గాడికి విషెస్ చెప్పి బయల్దేరుతుంటే ఒక్కసారి నా..కళ్ళు మండి కళ్ళలోంచి నీళ్ళు బొట బొటా కారాయి...మా శరత్ గాడు 'నేనెందుకు కళ్ళనీళ్ళెట్టుకున్నానో తెలీక వాడు వాడు కూడా కళ్ళు తుడుచుకున్నాడు '.


అదంతా చూస్తున్న మా శీనుగాడు ఏదో అర్ధమయ్యినట్టు నా వంక చూసి...నా దగ్గర ఇంకోటుందిలే.....పద అన్నాడు..


"కట్ చేస్తే"........మరుసటిరోజు ఉదయం ఏడుగంటలు...


"పొద్దున్నే ఆ నల్లకల్లజోడేంట్రా తింగరి వెదవా " అంటోంది మా నాన్నమ్మ నన్ను చూసి...


"కనులు కనులతో కలబడితే........"


---------- సమాప్తం--------

32 comments:

Anonymous said...

Lollllll..hheeeee.heee...:-)))

పానీపూరి123 said...

ha ha ha...

teresa said...

కలకే..కండ్ల కలకే. :)

Anonymous said...

chaala bavundi....

Srini said...

భలే ఉంది మీ (పెళ్ళి)అనుభవం.

రామ said...

బాగా వ్రాశారండీ.. మీ అనుభవంతో బాటు, కొంచెం కల్పన కూడా గూటించినట్టుగా అనిపించింది :). ఏది ఏమైనా చక్కగా ఉంది.

మధు said...

హహ్హహ్హా..భలే భలే అనుభవం. ప్రొద్దున్నే నవ్వులు పూయించారు.
ఇంతకాలం ఏమైపోయారు మాష్టారూ ?

Sravya V said...

ఇప్పుడు చెప్పండి
కనులు కనులతో కలపడితే...ఆ తగవుకు ఫలమేమి"? :)

Vinay Chakravarthi.Gogineni said...

chaala baagundi...............

మేధ said...

hahahha.. too good :))

sunita said...

baagundi.

GIREESH K. said...

hahaha....very nice

హరేఫల said...

చాలా బాగుంది.

నేస్తం said...

చాలా బాగా రాసారు ..మీ అమ్మగారి గురించి చదువుతుంటే నా ఫ్రెండ్ అమ్మగారు గుర్తు వచ్చారు , ఒక సారి వాళ్ళింటికి వెళితే ఇలాగే ఎదో సీరియల్ చూస్తూ ఆమె ,ఆమె అత్తగారు వెక్కి వెక్కి ఏడు స్తున్నారు, మాకు ఇది మామూలే ఇంక నువ్వు రా అని నా ఫ్రెండ్ విసుక్కుంటూ లోపలికి తీసుకు వెళ్ళింది నన్ను : )

లక్ష్మి said...

కనులు కనులతో కలపడితే ఎమవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారన్నమాట, గుడ్.

Anonymous said...

బాసూ ... కేక ...

Raj said...

బాగుంది.

చైతన్య.ఎస్ said...

:)

Uma said...

you're a very talent comedy writer Rishi gaaru ! I wish you write more often !

Chegodeelu is definitely one of the top humorous telugu blog around !

You make me laugh so much that I almost choke up !

Whenever I sing the song " kanulu kanulato", I'll remember seenu singing before you ! :-)

సుజాత వేల్పూరి said...

తగవుకు ఫలితం అనుభవించారా? ఈ సీను యధా తధంగా కట్ చేసి ఏదైనా సినిమాలో పెట్టెయ్యాలండీ రిషీ! ఇంకా నవ్వాగడం లేదు నాకు!

Anonymous said...

మీరు హాస్య రచయితల్లో సరి కొత్త మరియు ప్రశస్థ (latest and the greatest) తార. :)

-మురళి

Wanderer said...

మీ తెలుగు చక్కగానూ చదవడానికి హాయిగానూ ఉంది. ఈ లేటెస్టు పోస్టుతో మొదలుపెట్టి ఆగలేక మీ పాత పోస్టులన్నీ చదివాను. మీ శైలి ఇదీ అని ఒక ఫ్రేం లో బిగించలేము. అంత వైవిధ్యం ఉంది. ప్రతీ పోస్టూ నవ్వించింది, ప్రతీ పోస్టూ కొత్తగా ఉంది. మీరిలాగే కంటిన్యూ అయిపోండి. శోభన్ బాబు జయసుధల డాన్స్ మీద మీరు రాసినది absolute scream.

KK said...

mastaroo meeru keka :-)

ఉమ said...

రిషి గారు, నేను మీ ఫ్యాన్ ని ! చదివినవే మళ్ళీ మళ్ళీ చదివా మీ పోస్ట్స్ !

ప్లీజ్, ఒక కొత్త పోస్ట్ రాయరూ ? కళ్ళు కాయలు కాస్తున్నై కానీ మీ పోస్ట్ మాత్రం రాట్లేదు !

తోటరాముడు ని ఫాలో కాకండి, నాలుగు నెలలకో పోస్ట్ రాసే విషయం లో ! మీరు రోజు రాసినా , బోల్డు చాలా సంతోషం గా చదూతాం !

Anonymous said...

when is your new post mahaprabho?

శేఖర్ పెద్దగోపు said...

రిషి గారు,
హ్హ...హ్హహ..
చాలా చక్కగా, హాస్యం జతచేసి రాసారు. మీ ప్రెజెంటేషన్ చాలా బావుంది. ఇలాంటి కామెడీ చదివి ఎన్నాళ్ళవుతుందో!!

Malakpet Rowdy said...

LOL .... reallly hilarious - keep writing!

Anonymous said...

please please keep writing more often !

Anonymous said...

guru...kanulu kanulu tho kalabadithee aa taguvuku phalam "nalla kalla jodu" guru...

AvanthiRao said...

kanulu kanulatho kalabadite daani phalam meeku eepatiki telise untundi lendi ;)

Anonymous said...

chaala bagunfi

గోపాల్ said...

కుమ్మేసిందండి!! :)